A baby horse ran behind the bus in Coimbatore
mictv telugu

తల్లి అనుకొని బస్సు వెనకాల పరిగెత్తిన పిల్ల గుర్రం.. వీడియో వైరల్

September 13, 2022

లోకంలో తల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలే తన జీవితంగా, వారి ఆలనాపాలనా, అవసరాలు తీర్చడంలో తల్లి ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇది కేవలం మనుషులకే కాదు. జంతువుల్లో కూడా ఉంటుంది. తల్లి ప్రేమను చాటిచెప్పే ఎన్నో సంఘటనలు, వీడియోలు ఇదివరకే చూసి ఉంటాము. కానీ, అంతకుమించి అనేలా ఉన్న ఓ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ పిల్ల గుర్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. కోయంబత్తూరులోని పట్టీశ్వర దేవాలయం సమీపంలోని పడితుర ప్రాంతంలో పదికి పైగా గుర్రాలు ఉన్నాయి. అక్కడే గడ్డి మేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అయితే వారం క్రితం ఆ మందలోంచి ఓ పిల్ల గుర్రం తప్పిపోయింది. దాంతో తల్లి గుర్రాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతమంతా తిరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న ఓ బస్సు మీద గుర్రం ఫోటో ఉండడం చూసి దానినే తన తల్లి అనుకుంది. కాసేపు అక్కడే తిరిగుతూ కనిపించింది. కాసేపటికి ఆ బస్సు బయల్దేరగా, తన తల్లి పరిగెత్తుతుందనే భావనతో పిల్ల గుర్రం కూడా బస్సుతో పాటు పరుగెత్తింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవగా, వీడియోను చూసిన వారంతా ఆర్ధ్రత, ఆవేదనతో కన్నీరు పెట్టుకుంటున్నారు.