A bear that attack and ate a couple
mictv telugu

వామ్మో ఎలుగుబంటి.. గుడికెళ్లిన జంటను చంపి తినేసింది

September 15, 2022

A bear that attack and ate a couple

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గుడికి వెళ్లిన దంపతులపై దాడి చేసి వారిని చంపి ఆ తర్వాత తినేసింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. స్థానిక రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ఇందిరా ఠాకూర్, ముఖేష్ ఠాకూర్ అనే భార్యాభర్తలు నివాసముంటున్నారు. వీరు ఆదివారం జిల్లా కేంద్రమైన పన్నాకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి దర్శనం కోసం వెళ్లారు.

జిల్లా కేంద్రానికి ఈ ప్రాంతం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. ఆలయంలో ఉండగా దంపతులపై ఓ ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేసింది. తన కోరలు, గోళ్లతో వారిద్దరిని చంపేసింది. తర్వాత వారి మృతదేహాలను అడవిలో కొంత దూరం లాక్కెళ్లి వారి శరీరంలోని చాలా భాగాలను తినేసింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చాలా సేపు శ్రమించి ఎలుగుబంటి జాడను తెలుసుకోగలిగారు. జాగ్రత్తగా ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పి పడిపోయేలా చేశారు. అది అలా పడిపోగానే మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు డివిజనల్ అటవీ శాఖాధికారి గౌరవ్ శర్మ తెలిపారు. ఎలుగుబంటి తమ ఆధీనంలోనే ఉందని, దానిని స్థానిక జూకి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. అటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.