కరోనా మంచం.. చనిపోతే శవపేటికలా మారిపోతుంది..  - MicTv.in - Telugu News
mictv telugu

 కరోనా మంచం.. చనిపోతే శవపేటికలా మారిపోతుంది.. 

May 23, 2020

Hospital beds

అంటుముట్టుడు రోగంలా దూసుకువచ్చిన కరోనా మహమ్మారి ఇప్పటికి ఎందరో ప్రాణాలను బలిగొంది. కనీసం చనిపోయాకైనా ఆ మృతదేహాన్ని ముట్టుకునే వీలులేకుండా చేస్తోంది. దీంతో చనిపోయినవారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తే.. మృతదేహం నుంచి కరోనా మరింత వ్యాప్తి చెందవచ్చని చలా దేశాల్లో చనిపోయినవారికి ప్రభుత్వాలే సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. కుప్పలు తెప్పులుగా శవాలను ఒకే గుంతలో పూడ్చిపెట్టడం వంటి దారుణాలు అమెరికాలో చూస్తున్నాం. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ను మనో వేదనకు గురిచేశాయి. దీంతో ఆసుపత్రి పడకలనే శవపేటికలుగా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఈక్వెడార్‌లోని గ్వాయేకిల్‌లో మృతదేహాలతో కొంతమంది వీధుల్లోకి వచ్చారు. కరోనా కారణంగా అంత్యక్రియలు కూడా సరిగ్గా నిర్వహించుకునే వీల్లేకుండా పోయింది. అందుకే శవపేటికలుగా రూపాంతరం చెందే బెడ్లను తయారుచేశాం’ అని రొడాల్ఫొ వెల్లడించారు. 

ఈ బెడ్ల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘మెటల్‌ రెయింగ్స్‌‌తో ఈ బెడ్లను తయారుచేశాం. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు ఉంటాయి. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. ఈ బయోగ్రేడబుల్‌ బెడ్‌- కఫిన్స్‌ 92 నుంచి 132 డాలర్లకు లభించేలా తయారు చేస్తున్నాం. దీంతో మృతదేహం నుంచి వైరస్‌ వ్యాపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఈ బెడ్లను తొలుత కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆసుపత్రికి విరాళంగా ఇస్తున్నాం’ అని రొడాల్పో చెప్పారు. బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేస్తున్నామని తెలిపారు. కొలంబియా, ఈక్వెడార్‌లతో పాటు పెరూ, ,మెక్సిక్‌, చిలీ, బ్రెజిల్‌, యూఎస్‌కు వీటిని ఎగుమతి చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు.