భార్యాభర్తల పంచాయితీలో చనిపోయిన పెద్ద మనిషి - MicTv.in - Telugu News
mictv telugu

భార్యాభర్తల పంచాయితీలో చనిపోయిన పెద్ద మనిషి

May 6, 2022

భార్యాభర్తల గొడవలు తీర్చడానికి పెద్ద మనిషి హోదాలో పంచాయితీకి వెళ్లిన వ్యక్తి దాడిలో చనిపోయిన ఉదంతం ఇది. నిజామాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో నివసించే వసంతకు కల్లెడకు చెందిన రమేష్‌తో ఆరేళ్ల క్రితం పెళ్లయింది. మూడేళ్లలో ఇద్దరు కుమారులు పుట్టగా, ఆ తర్వాత రమేష్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అయితే సంపాదించిన డబ్బంతా తల్లిదండ్రులకే పంపుతున్నాడన్న కోపంతో వసంత రెండున్నరేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల మూడో తేదీన దుబాయి నుంచి వచ్చిన రమేష్ భార్యకు ఫోన్ చేసి కాపురానికి రావాలని కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో మధ్యవర్తిత్వం కోసం బంధుమిత్రులు, పెద్ద మనుషులను తీసుకెళ్లాడు. పంచాయితీ సందర్భంగా ఇరు వైపుల బంధుమిత్రుల మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన వసంత బంధువులు రమేష్ బంధువుల మీద కారంపొడితో దాడి చేశారు. అనంతరం కర్రలు, కత్తులతో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో రమేష్ తరపు పెద్ద మనిషి గండికోట రాజన్న (65) తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా, దారిలో మృతి చెందాడు.