A BJP leader harassed a woman leader in tamilnadu
mictv telugu

మహిళా నేతను వేధించిన బీజేపీ నేత.. ఈ వీడియోనే సాక్ష్యం

September 14, 2022

మహిళలపై వేధింపులు అన్ని రంగాల్లో కామన్ అని అంటుంటారు. దానికి రాజకీయం కూడా అతీతం కాదని నిరూపించే కొన్ని వార్తలు వస్తుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం తమిళనాడులో హల్‌చల్ చేస్తోంది. ఓ బీజేపీ మహిళా నేతను అదే పార్టీకి చెందిన పురుష నేత లైంగిక వేధింపులకు పాల్పడ్డ వీడియోను అధికార డీఎంకే పార్టీ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. బీజేపీలో చేరిన మహిళలు ఆ పార్టీ నేతల నుంచి తమను తాము కాపాడుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోందా? అని క్యాప్షన్ పెట్టారు. రామనాధపురం జిల్లాలో దళిత నేత ఇమ్మానుయేల్ శేఖరన్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. వీడియో ప్రకారం.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్ బాలగణపతి మహిళా నేత అయిన శశికళ పుష్ప చీరను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆమె తోసివేసింది. ఇలా రెండు మూడు సార్లు జరిగినట్టు వీడియోను బట్టి తెలుస్తోంది. ఆపై ఆమె ఎడమ చేతిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియోపై పొన్ బాలగణపతి ఇంతవరకు స్పందించలేదు.