స్వాగత తోరణాలతో ముస్తాబైన భాగ్యనగరం.. నేటి నుంచే షురూ - MicTv.in - Telugu News
mictv telugu

స్వాగత తోరణాలతో ముస్తాబైన భాగ్యనగరం.. నేటి నుంచే షురూ

July 2, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బీజేపీ స్వాగత తోరణాలతో నిండిపోయింది. ఎటుచూసినా కాషాయపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ విస్తరణ, మోదీ పాలన గురించి ప్రజలకు మరిన్ని విషయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ముందుకెళ్తోంది. ఈ క్రమంలో నేటి నుంచి హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు శనివారం ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు బీజేపీ అగ్రనాయకులంతా హైదరాబాద్ రానున్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు శుక్రవారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సమావేశాలు హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీ (కాకతీయ) ప్రాంగణంలో జరగనున్నాయి.

అయితే, నగరవాసులు, తెలంగాణ ప్రజలు కాషాయపు జెండాలను, పెక్ల్సీలను, కటౌట్లను చూస్తూ.. మోదీ తెలంగాణ రాష్ట్రంపైనే ఎందుకు దృష్టి సారించారు? అని తెగ చర్చించుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్య నాయకులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారు? అని ఆలోచలనలో పడ్డారు. తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను చూస్తుంటే, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ మధ్య బీజేపీల మధ్య తగ్గపోరు ఉంటుందని, ఇప్పటినుంచే ఆ సంకేతాలు కన్పిస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీజేపీ నాయకులు  పాదయాత్రలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ తర్వాత ప్రజల్లో తమ పట్ల మరింత నమ్మకం పెరుగుతుందన్న ఆశాభావాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.