యూపీలో పడవ బోల్తా.. నీట మునిగిన 30 మంది
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. 30 మంది ప్రయాణీకులతో నదిలో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఇందులో 20 మంది ఈదుకుంటూ ప్రాణాలు దక్కించుకోగా.. ఏడుగురిని స్థానిక అధికారులు కాపాడారు. అయితే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పవడం విషాదాన్ని నింపింది.
బైరానా మౌ మజారి గ్రామంలోని సుమ్లీ నది ఒడ్డున ప్రతీ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానిక ప్రజలు పడవలో బయల్దేరగా.. నది మధ్యలో రాగానే పడవ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 30 మంది నీటిలో మునిగిపోయారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు రీతూ యాదవ్ (14), ప్రియాంక (6), హిమాన్షు (8)లు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అటు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.