దేశంలో ఇంకా స్వాతంత్ర్యం రాని కేటగిరీలో రైతు ముందుంటాడు. కాయకష్టంతో అందరికంటే ఎక్కువ శ్రమపడి చాలా సులువుగా దోపిడీకి గురవుతుంటాడు. ప్రభుత్వాలు మారుతున్నా వ్యవస్థలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రోజురోజుకీ రైతు పరిస్థితి మరింత దీనంగా తయారవుతోంది. తాను చేసిన ఉత్పత్తికి తగిన ధర రాక నేటి రైతు దళారుల చేతిలో తల్లడిల్లిపోతున్నాడు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా తాజా ఘటనను చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రైతు తుకారాం చవాన్ 512 కిలోల ఉల్లి తీసుకువస్తే దళారి ఖర్చులన్నీ పోను కేవలం రెండు రూపాయల చెక్ చేతిలో పెట్టాడు. అది కూడా 15 రోజుల తర్వాత విత్ డ్రా చేసుకోవాలని హేళన చేశాడు.
అద్దె, హమాలీ, తోలకం తదితరాలకు రూ. 509 కట్ చేస్తున్నానని బిల్లు చేతిలో పెట్టాడు. ఈ బిల్లును స్వాభిమాన్ షెట్కారీ సంఘం అధ్యక్షుడు రాజు శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రైతు దుస్థితిని మరోసారి ఎత్తిచూపాడు. బిల్లుతో పాటు ట్వీట్ చేస్తూ తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. ‘కాస్తైనా సిగ్గుపడండి గవర్నర్లు. రైతులకు ఎలా బతకాలో మీరు నేర్పించండి. ఓ వైపు కరెంటు కోతలతో పంట కళ్ళముందే నాశనం అవుతోంది. షోలాపూర్ మార్కెట్ కమిటీలో రైతు దోపిడీకి గురవుతున్నాడు. రెండు రూపాయల చెక్ ఇచ్చి 15 రోజుల తర్వాత క్లియర్ అవుతుందని దళారి రైతుకు చెప్తున్నాడు. ఇలా జరగడంపై మీకు సిగ్గనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు.