తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. భూపాలపల్లికి చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమెను గత కొంతకాలంగా రాహుల్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే రక్షిత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె సూసైడ్ చేసుకుంది. వరంగల్‌లోని బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
చాలాకాలం నుంచి రక్షితను రాహుల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో రక్షిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజగా మరోసారి ఆమెపై వేధింపులకు దిగాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడాన్ని రక్షిత జీర్ణించుకోలేకపోయింది. శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన ఆమె కాలేజీ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయల్దేరింది. కానీ కాలేజీకి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండు రోజులు తర్వాత ఆమె తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంది. దీంతో కాలేజీ హాస్టల్ మానిపించేసి బంధువుల ఇంట్లో ఉంచారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది.