బస్టాప్ చోరీ.. ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఫాఫం! - MicTv.in - Telugu News
mictv telugu

బస్టాప్ చోరీ.. ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఫాఫం!

October 22, 2020

kmnn

బంగారం, బస్సులు, డబ్బు, పర్సులు.., ఇలా ఇంకెంత కాలం రొటీన్ దొంగతనాలు చేస్తాం? కాస్త వెరైటీగా దొంగతనం చేసి అందరి దృష్టిని ఆకట్టుకుందాం అని ఆ దొంగలు భావించినట్టున్నారు. అనుకున్నదే తడవుగా బస్‌స్టాపును ఎత్తుకెళ్లారు. రాత్రంతా ఉన్న బస్‌స్టాప్ తెల్లారేసరికి మాయం అవడంతో స్థానికులు అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. తొలుత అధికారులే తొలగించి, ఏమైనా రిపేర్ వంటివి చేసి మళ్లీ అమర్చుతారేమో అనుకున్నారు. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. నగరంలోని దేవకి ప్యాలెస్ ఎదుట పూణె నగర పాలక సంస్థ ఓ బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేసింది. అకస్మాత్తుగా అది తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. కింది నుంచి దాని బోల్టులు లూజ్ చేసి చక్కగా ఎత్తుకెళ్లారు. పానాలు, కటింగ్ ప్లేర్లు, సుత్తెలు వంటి ఆయుధాలతో వచ్చి బస్‌స్టాప్‌ను పెకిలించుకుపోయారు. 

తెల్లారేసరికి ఈ చోరీ విషయం తెలుసుకున్న స్థానిక నేత, ఎన్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ షాక్ అయ్యారు. ఆ బస్‌స్టాప్ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ.5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. నవ్వులు పూయిస్తున్నారు. ‘పాపం దొంగలు ఎంత కరువులో ఉండుంటాడో. పోయి పోయి బస్‌స్టాప్‌కే కన్నం వేశారు’ అని ఓ నెటిజన్ ఛమత్కరించాడు. గతంలో ఇక్కడ బస్‌స్టాప్ ఉన్నమాట వాస్తవమేనని, ఇప్పుడది కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ‘ఆ దొంగలు దానిని తీసుకెళ్లి పాత సామాన్లవాడికి అమ్ముకుని ఉంటారు’ అని స్థానికులు భావిస్తున్నారు.