టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆత్మకూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేశారు. ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల పాదయాత్ర చేశారు. వై.కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన సభలో శ్రీరామ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా పరిటాల ప్రసంగం ఉందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో పరిటాల శ్రీరామ్‌తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పరిటాల ఏమన్నారు..?
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదంటూ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో తమ ప్రభుత్వం నిర్మించిన రోడ్లు, వంతెనలపైనే నిలబడి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పరిటాల సూచించారు. పేరూరు జలాశయానికి రూ.803 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టామన్నారు. పేరూరు కాల్వ పూర్తిచేసి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.