తిరుపతిలో గత 10 రోజులుగా హడలెత్తిస్తున్న చిరుత పులి చిక్కింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత పులి పడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజులుగా ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత తిరగడంతో..విద్యార్థులు, సిబ్బంది, స్థానికలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యూనివర్సిటీ వీసీ బంగ్లాలో ప్రవేశించిన చిరుత ఓ కుక్కను ఎత్తుకెళ్ళి చంపి తినడంతో విద్యార్ధులు అల్లాడిపోయారు. సోమవారం రాత్రి మళ్లీ మూడు చిరుత పులులు విద్యార్థినిల హాస్టల్ సమీపంలో సంచరించినట్లు సీసీ కెమెరాలు రికార్డు కావడంతో కంటిమీద కునుకు లేకుండా గడిపారు.
చిరుత సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత పులి జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. రెండు వేర్వేరు ప్రదేశాలలో వాటికోసం బోనులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో కెమెరాలను అమర్చి చిరుత అడుగుజాడలన గమనించారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు పెట్టారు. చివరికి ఆదివారం ఉదయం చిరుత బోనులో చిక్కింది. దానిని అధికారులు శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇది కాకుండా మరో చిరుత కూడా ఉందని అధికారులు అంచనాకు వచ్చి దాని కోసం మరో రెండు బోనులను ఏర్పాటు చేశారు.