ఏపీలో మంత్రి ర్యాలీ ఎఫెక్ట్.. చిన్నారి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మంత్రి ర్యాలీ ఎఫెక్ట్.. చిన్నారి మృతి

April 16, 2022

fnhgb

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి కోసం తీసిన ర్యాలీ వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ర్యాలీ కోసం ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ ఆపివేయడంతో అందులో చిక్కుకొని, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా చేసిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్న కళ్యాణ దుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తొలిసారి మంత్రి హోదాలో పట్టణానికి వస్తున్న సందర్బంగా ఆపార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను ఆపివేశారు. ఈ క్రమంలో శెట్టూరు మండలం శెర్లోపల్లికి చెందిన గణేష్ – ఈరక్క దంపతులు అస్వస్థతకు గురైన తమ 8 నెలల పాపను తీసుకొని ఆటోలో ఆస్పత్రికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకోగా, ఆలస్యం అవుతుండడంతో టూవీలర్‌పై పాపను ఆస్పత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించగా, తల్లిదండ్రులు భోరున ఏడ్చారు. ట్రాఫిక్ లేకపోయి ఉంటే తమ కూతురు బతికేదని గుండెలవిసేలా రోదించారు. కాగా, పోలీసులు స్పందిస్తూ.. తాము ఎవరినీ అడ్డుకోలేదనీ, చిన్నారి గురించి తెలియగానే వెంటనే వారికి దారిచ్చి పంపామని తేల్చి చెప్పారు.