రాత్రంతా టీవీ చూపించారు! - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రంతా టీవీ చూపించారు!

November 28, 2022

పిల్లలు అల్లరి చేస్తున్నారని ఊరుకోలేము. అలా అని కొట్టి వారిని మొండివాళ్లని చేయకూడదు. అందుకే కొత్త పేరెంటింగ్ చేసిందో తల్లి. చైనాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైరల్ అవుతున్నది. హోంవర్క్ మానుకొని ఆడుకొనే పిల్లలు చాలామంది ఉంటారు. ఒకవేళ కొట్టి చెప్పినా, తిట్టి చెప్పినా మొండికేసే పిల్లలుంటారు. అలాంటి వారికి కొంత సున్నితంగా చెప్పి చూడాలి. లేకపోతే ఇదిగో.. ఈ చైనా దంపతులు చేసినట్టు చేయాలి. తమ కొడుకు అదే పనిగా టీవీ చూస్తున్నాడని అర్థమైందా తల్లిదండ్రులకు. అందుకే బలవంతంగా టీవీ ముందు కూర్చోబెట్టారు. రాత్రంతా టీవీ చూడమని శిక్ష వేశారు. ఇంకేం పిల్లాడికి సంతోషమే కదా అనుకునేరు. ఒక గంట, రెండు గంటలు సంతోషంగానే ఉంది. ఆ తర్వాత టార్చర్ మొదలైంది పిల్లాడికి. ఇక టీవీ ముందు కూర్చొనని ఏడుపు అందుకున్నాడు. అయినా కూడా ఆ తల్లిదండ్రులు వినలేదు. బలవంతంగా టీవీ ముందే ఉండాలని హుకూం జారీ చేశారు. దీంతో ఆ పిల్లాడు ఇంకెప్పుడూ టీవీ చూడనని వారికి మాటిచ్చాడు.

సెంట్రల్ చైనాలో హునాన్ ప్రోవిన్సీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎనిమిది సంవత్సరాల బాలుడిని ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. వెళ్లేముందు.. హోంవర్క్ చేసి తాము వచ్చేసరికి పడుకోమని చెప్పారు. అయితే వాళ్లు వచ్చేవరకు ఆ పిల్లాడు టీవీ చూస్తూ కనిపించాడు. పైగా హోమ్ వర్క్ కూడా చేయలేదు. తల్లిదండ్రులు రాగానే మెల్లగా తన రూమ్ లోకి జారుకున్నాడు. దీంతో కోపం వచ్చిన అతని తల్లి బెడ్రూమ్ నుంచి లివింగ్ రూమ్ లోకి తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెట్టింది. ముందు సంతోషించినా ఆ తర్వాత లేచి ఉండడం ఆ పిల్లాడి వల్ల కాలేదు. అతన్ని మానిటర్ చేస్తూ కాసేపు తండ్రి, తల్లి కూర్చున్నారు. తెల్లవారుజామున 5గంటల వరకు ఆ పిల్లాడిని అలాగే టీవీ ముందు కూర్చోబెట్టారు. ఈ మొత్తం వీడియో వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. చాలామంది తల్లిదండ్రులు తమ సమస్యకు పరిష్కారం దొరికిందని సంతోషిస్తున్నారు. కొందరు మరి ఇంతలా శిక్షించడం కరెక్ట్ కాదు అంటున్నారు. మరి మీరేమంటారు?