వినడానికి ఈ మాట ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాకు చెందిన ప్రముఖ ఐస్‌క్రీం తయారీ సంస్థ జాంగ్ షుగావో అనే కంపెనీ తమ ఐస్‌క్రీం అధిక ఉష్ణోగ్రతల్లోనూ కరగవంటూ సంచలన ప్రకటన చేసింది. దీంతో టెస్ట్ చేద్దామనుకున్న వినియోగదారులు కరిగించడానికి రకరకాలుగా ప్రయత్నించారు. ఒకరు క్రీమ్ బార్ కింద లైటర్‌తో నిప్పు పెట్టాడు. కరుగుతుందేమో అనుకుంటే కాలిపోతున్న వాసన వచ్చింది. మరొకరు 31 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట పెట్టినా కరగలేదని వాపోయాడు. ఈ వీడియోలన్నీ యూట్యూబులో చేరి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అయితే అంత మంట పెట్టినా కరగడం లేదంటే దాని నాణ్యతలో ఏదో లోపం ఉందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దానికి కంపెనీ‘జాతీయ అథారిటీ ఏర్పాటు చేసిన నాణ్యతా ప్రమాణాల మేరకే తయారు చేశాం. అందులో పాలు, కొబ్బరి తురుము, సింగిల్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, పాలపొడి ఉన్నాయి’అని తెలిపింది. కాగా, మంటకే ఐస్‌క్రీం కరగనప్పుడు తింటే మాత్రం మనుషులు ఎలా అరాయించుకోగలరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.