సుపారీ ఇచ్చి చంపించడం చూశాం కానీ వ్యసనాన్ని మానిపించడం ఇదే తొలిసారేమో. ఈ విషయంలో తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చైనాలో ఈ ఘటన జరిగింది. ఆన్ లైన్ గేములకు బానిసైన ఐదో తరగతి చదివే పిల్లాడు.. వాటికి పూర్తి బానిస అయిపోయాడు. చదువుకోమని ఎంత చెప్పినా పేరెంట్స్ మాట అస్సలు వినేవాడు కాదు. రోజురోజుకీ ఆయా ఆటల్లో నైపుణ్యం సంపాదించి తనంత ఆటగాడు లేడని తెగ బిల్డప్పులు ఇచ్చేవాడు. దీంతో సుదీర్ఘంగా ఆలోచించిన అతని పేరెంట్స్ ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను ఫాలో అయ్యారు. బాలుడు ఆడే ఆటల్లో నిష్ణాతుడైన ప్రొఫెషనల్ ఆన్ లైన్ గేమర్ ని లైన్లో పెట్టారు. అతనికి గంటకు రూ. 600 చొప్పున సుపారీ ఇచ్చి ఆన్ లైన్ గేములో తమ కొడుకును ఘోరంగా ఓడించమన్నారు. అలా చేసి బాలుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. అనుకున్నట్టుగానే వారి ప్లాన్ సక్సెస్ అయింది. బాలుడితో ఐదారు గంటలు గేమ్ ఆడిన ఆన్ లైన్ గేమర్.. అందులో బాలుడిని చిత్తుచిత్తుగా ఓడించాడు. అన్ని గేములలో ఓడిపోవడంతో ఖంగుతిన్న బాలుడు.. ఓటమితో ఆటపై ఇష్టాన్ని కోల్పోయి విరక్తి చెందే పరిస్థితి వచ్చింది. ఘోర ఓటమితో బాధపడుతున్న తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రలు ఇకనైనా ఆటలను వదిలేసి బుద్ధిగా చదువుకోమని ప్రేమపూర్వకంగా చెప్పడంతో అంగీకరించిన బాలుడు సోషల్ మీడియాను వదిలేశాడు. ఈ విషయాలను ఆన్ లైన్ గేమర్ బయటపెట్డడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఒక బాలుడిని ఇలాంటి వ్యసనం నుంచి బయటపడేసినట్టు తన బ్లాగులో రాసుకొచ్చాడు. మీ ఇళ్లల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ పద్ధతిని ఫాలో అయి చూడండి. రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.