ఒక గొంతు….దేశమంతా మోగింది. బ్రిటీష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను దేశమంతా తెలిసేలా చేసింది. గాంధీజీ, కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్న పోరాటాలను చాటి చెప్పింది. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించింది. ఇది ఉషా మెహతా అన్ టోల్డ్ స్టోరీ. ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియని కథ. అందరికీ స్ఫూర్తిగా నిలిచే నిజజీవిత గాథ.
ఉషా మెహతా కథను సినిమాగా మలిచి చూపిస్తున్నారు దర్శకులు కన్నన్ అయ్యర్, దరబ్ ఫరూఖీలు. మొత్తం కథ అంతా కన్నన్ రాసినా…దర్శకత్వాన్ని మాత్రం ఇద్దరూ కలిపి చేస్తున్నారు. సినిమా పేరు ఆయే వతన్ మేరే వతన్. ఇక ఉషా పాత్రను సారా అలీఖాన్ పోషిస్తోంది. డ్రమాటిక్ ప్రొడక్షన్ దీన్ని నిర్మిస్తోంది. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఉషాగా సారా అలీఖాన్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అప్పటికాలం మేకప్ లో సారా బాగానే సెట్ అయింది. చూడ్డానికి బావుంది. ఇప్పటివరకు అల్లరి అమ్మాయిగా, హాట్ హీరోయిన్ గా నటించిన సారాకు నటనకు అవకాశం ఉన్న మూవీ లభించింది. ఎలా చేస్తుందో మరి, చూడాలి.
ఇక ఉషా మెహతా సంగతికి వస్తే…క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో రేడియోను నడిపి కాంగ్రెస్ కార్యకలాపాలను, పోరాటాలను ప్రజలకు చేరవేసిన ఘనత ఈమెది. 1920లో గుజరాత్ లోని సరస్ లో పుట్టారు.చిన్నప్పటి నుంచే స్వాతంత్ర ఉద్యమానికి ప్రభావితం అయ్యారు. గాంధీజీ మార్గాలను అనుసరించేవారు. ఖద్దరు మాత్రమే ధరించవారు. అంతేకాదు ఉషా చదువులో కూడా టాపర్. ఫిలాసఫీలో డిగ్రీ చేసిన ఈమె ఎప్పుడూ దేశం కోసం ఏదో చేయాలనే తపనలో ఉండేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పడు ఈమె వాళ్ళ నాన్నతో చెప్పారు….నేను నా దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. తాను చదువుకున్న చదువుకు ఒక అర్ధం ఒవ్వాలనుకుంటున్నాను అని. అదే రోజు రాత్రి ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారో ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఒకరోజు దేశం మొత్తం ఆమె గొంతు మారు మోగింది. ఇది కాంగ్రెస్ రేడియో, ఏదో ఒక చోట నుంచి ప్రసారం అవుతోంది అంటూ. ఉషా తన స్నేహితులు విఠల్ భాయ్ ఝవేరీ, చంద్రకాంత్ ఝవేరీ, బాబూ భాయ్ థక్కర్, నానక్ మోత్వానీతో కలిసి ఒక రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేసారు.వాళ్ళు దీన్ని సీక్రెట్ గా మెయింటెయిన్ చేసేవారు. రోజుకో చోట స్టేషన్ ఉండేది. బ్రిటీష్ వాళ్ళకు తెలియనివ్వకుండా తమ రేడియో కార్యకలాపాలను నిర్వహించేవారు. కాంగ్రెస్ చేస్తున్న పనులన్నీ అందులో ప్రసారం చేసేవారు.
ఉషా మెహతా, ఫ్రెండ్స్ నడిపిన ఈ రేడియో అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపేది. ఎప్పుడైనా జనాలు కొంచెం నిరాశ చెందారు అనిపించినా ఈ రేడియోలో వచ్చే మాటలు విని మళ్ళీ ఉత్తేజితులయ్యావారు. అలా స్వాతంత్ర్యం వచ్చేవరకు ఈ రేడియో పని చేస్తూనే ఉంది. ఈ రేడియో కేవలం 88 రోజులు మాత్రమే పనిచేసింది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఫిబ్రవరి, మార్చి మధ్యలో, మళ్ళీ 1943లో కొంత కాలం, 44లో మరికొంత కాలం ప్రసారాలు వచ్చాయి. తరువాత దీనిని మూసేసారు. కానీ క్విట్ ఇండియా టైమ్ లో చేసిన సేవలకు వీళ్ళకు మంచి గుర్తింపు వచ్చింది. 1988లో ఉషా మెహతాకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.