వ్యోమగాములను భూమిపై నుంచే ఫొటో తీసిన సామాన్యుడు! - MicTv.in - Telugu News
mictv telugu

వ్యోమగాములను భూమిపై నుంచే ఫొటో తీసిన సామాన్యుడు!

March 31, 2022

nhj

సాధారణంగా మనం అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలను చూసి ఉంటాం. కానీ, భూమిపై నుంచి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను ఫోటో తీయడం ఎప్పుడైనా విన్నారా? జర్మనీలోని సెబాస్టియన్ అనే ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ ఈ పని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందుకోసం అత్యాధునిక, అతి శక్తివంతమైన కెమెరాలను వాడాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు స్పేస్‌వాక్ చేస్తుండగా, ఆ ఫోటోలను కూడా తీశాడు. పూర్తి వివరాల్లోకెళితే.. మార్చి 23న నాసా వ్యోమగామి రాజాచారి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి మథియాస్ మారెర్‌లు దాదాపు 7 గంటల పాటు ఐఎస్ఎస్‌ నుంచి బయటకు వచ్చి రకరకాల మరమ్మత్తు పనులు చేశారు. ఆ సమయంలోనే సెబాస్టియన్ వాళ్ల ఫోటోలు తీశాడు. మరో విశేషమేంటంటే.. సెబాస్టియన్ ఊరు మారెర్ ఊరు రెండూ ఒక్కటే. సెబాస్టియన్ తీసిన ఫోటోలో రాజాచారి కూడా ఉన్నారు. ఈ విషయంపై సెబాస్టియన్ స్పందిస్తూ.. ‘ సూర్యాస్తమయం తర్వాత నేను వాళ్ల స్పేస్ వాక్ చూశాను. మారెర్ ఏదో వెతుకుతున్నారు. జీవితంలో ఒక్కసారే తీయగలిగే ఫోటో తీశాననుకుంటున్నాను. భూమి నుంచి తీసిన మొదటి ఫోటో బహుశా నాదే కావచ్చ’ని ఆనందం వెలిబుచ్చాడు. కాగా, ఫోటో కోసం సెబాస్టియన్ వాడిన కెమెరా ధర రూ. 11 లక్షలుంటుంది.