A constable harassing a woman in hyderabad
mictv telugu

వివాహితపై పోలీస్ అత్యాచారం..జైలుకు వెళ్లినా..

November 17, 2022

కంచె చేను మేస్తోంది. క్రైంను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే నేరాలకు కారణమవుతున్నారు. సామాన్యులను బెదిరించి కొందరు పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే భాగ్యనగరంలో మరోసారి బయటపడింది. ఓ వివాహితను బెదిరించి కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివారాల్లోకి వెళితే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్‌గా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు. ఆయన నివసిస్తున్న సైదాబాద్‌లో ఓ వివాహితను వేధించాడు. పలుమార్లు అసభ్యకరంగా కూడా ప్రవర్తించాడు. దీంతో ఆమె 2021లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలివేయగా… మళ్లీ అదే విధంగా ప్రవర్తించాడు. ఇక మరోసారి ఫిర్యాదు చేయగా… కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళ కూడా ఆ ఏరియా నుంచి వెళ్లిపోయింది. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన కానిస్టేబుల్.. ఆ మహిళ అడ్రస్‌ను తెలుసుకున్నాడు. తిరిగి మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి వేధింపులకు గురిచేశాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 14న మధ్యాహ్నం ఆమె ఇంటికెళ్లి తనపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించడంతో స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు. ఈ నెల 14న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.