కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఓ వారం పాటు సెలవు కోసం ఏఎస్పీకి లేఖ రాశాడు. అందులో తన భార్య అలిగిందని, బుజ్జగించడానికి సెలవు కావాలని మొరపెట్టుకున్నాడు. తన మీద కోపంతో ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోయాడు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన 2016 బ్యాచ్ కానిస్టేబుల్ గౌరవ్ చౌదరి కథ ఇది. మౌ జిల్లాలో నివాసముందే కానిస్టేబుల్ మహారాజ్ గంజ్ జిల్లా నౌత్వానా స్టేషనులో డ్యూటీ చేస్తున్నాడు. గౌరవ్ కి డిసెంబరులో వివాహం జరగ్గా, కొద్ది రోజుల అనంతరం భార్యను ఇంటి వద్ద దింపి విధులకు హాజరవుతున్నాడు. వెళ్లేటప్పుడు మేనల్లుడి పుట్టినరోజు వేడుకల కోసం వారం రోజులు సెలవు తీసుకొని వస్తానని మాటిచ్చి వెళ్లాడు. కానీ ఆ లోపే భార్య అలిగింది. ఫోన్ చేసినా స్పందించకుండా తన చిరుకోపాన్ని ప్రదర్శించింది. ఒక్కోసారి ఫోన్ ని తన అత్తకు ఇచ్చి మౌనంగా నిరసన తెలియజేసింది. దీంతో ఇంట్లో పరిస్థితిని వివరిస్తూ సదరు కానిస్టేబుల్ ఏఎస్పీకి లేఖ రాశాడు. ఎట్టి పరిస్థితుల్లో తనకు వారం పాటు సెలవు కావాలని లేఖలో పేర్కొన్నాడు. సాటి మగాడిగా అతని బాధను అర్ధం చేసుకున్న ఏఎస్పీ అతీష్ కుమార్ సింగ్.. ఐదు రోజుల పాటు సెలవు మంజూరు చేశారు. జనవరి 10 నుంచి 15 వరకు ఇంటికి వెళ్లి భార్యను లాలించేందుకు అనుమతి ఇచ్చాడు.