A dangerous zebra crossing is in England
mictv telugu

ఇంగ్లాండులో ప్రతీవారం ప్రమాదం జరిగే జీబ్రా క్రాసింగ్.. వీడియో చూడండి

November 18, 2022

నిబంధనలకు అతిక్రమించి రోడ్డు ప్రమాదాలకు కారణమవడం తద్వారా ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మన దేశంలో కొత్త కాదు కానీ, పాశ్చాత్య దేశాలలో మాత్రం అరుదనే చెప్పాలి. మనకంటే వాళ్ల వద్ద బెటర్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి అంతా పకడ్బందీగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ, ప్రపంచంలోనే అతి ప్రమాదకర జీబ్రా క్రాసింగ్ లైన్ ఇంగ్లాండులో ఉందని తెలుసా. ఇక్కడ ప్రతీవారం ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఇది సీసీ కెమెరా వీడియో ఆధారంగా నిరూపితమైంది.

వెస్ట్ యార్క్ షైర్ నగరమైన బ్రాడ్ ఫోర్డ్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఉన్న హర్టర్ గ్రాంజ్ రోడ్డుపై ఈ జీబ్రా క్రాసింగ్ ఉంది. ఇక్కడ గతేదాడి నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి సంఖ్య తక్కువే అయినా ప్రతీవారం ప్రమాదం జరగడం మాత్రం విషాదమే అని చెప్పాలి. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా అక్కడి కౌన్సిల్ మాత్రం వీరి విన్నపాన్ని పట్టించుకోవట్లేదు. చివరికి స్థానికులే ప్రమాద తీవ్రతను అంచనా వేసేందుకు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో రికార్డయిన వీడియోలతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇటీవలే ఓ బాలుడు సైకిల్ పై క్రాసింగ్ దాటుతుండగా, బాలుడిని చూసి ఒక కారు ఆపినా మరో కారు వచ్చి ఢీకొట్టింది.


అద్రుష్టవశాత్తూ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. క్రాసింగ్ ఉందని వంద మీటర్ల నుంచి కనిపిస్తున్నా, గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించకూడదని సూచిక బోర్డులున్నా డ్రైవర్లు ఎందుకు పరధ్యానంగా ఉంటున్నారో అర్ధం కావడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీవారం ఓ ప్రమాదం చోటు చేసుకుంటుందని ఐదుగురు పిల్లల తండ్రి అయిన మహ్మద్ తెలిపాడు. ప్రమాదంలో గాయపడితే కాదు ప్రాణాలు కూడా అదే సంఖ్యలో పోతేనే తప్ప పట్టించుకోనవసరం లేదనే ధోరణిలో అధికారులు ఉన్నట్టు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.