కాన్పు కోసం తల్లి పుట్టింటికి పిలిచిందని ఆత్మహత్య చేసుకున్న కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

కాన్పు కోసం తల్లి పుట్టింటికి పిలిచిందని ఆత్మహత్య చేసుకున్న కూతురు

November 8, 2022

గర్భంతో ఉన్న కూతురిని కాన్పు కోసం పుట్టింటికి పిలిచింది ఆ తల్లి. కానీ వెళ్లడం ఇష్టం లేని కూతురు.. పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూములో దూరి తలుపులేసుకుంది. అక్కడే ఉన్న గడ్డి మందు తాగేసింది. ఆసుపత్రిలో చూపించినా ఫలితం లేకపోవడంతో చివరికి ప్రాణాలు విడిచింది. ఏపీలో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంకు చెందిన కుమారికి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లకు చెందిన ఆనంద్‌‌తో ఎనిమిది నెలల క్రితం పెళ్లయింది. ప్రస్తుతం కుమారి ఐదు నెలల గర్భిణి.

దీంతో ఈ నెల 2న కుమారి తల్లి లక్ష్మీదేవి కాన్పు కోసం పుట్టింటికి తీసుకెళ్తానంటూ గువ్వలకుంట్లకు చేరుకుంది. పుట్టింటికి వెళ్దాం రా అని తల్లి పిలిస్తే రానంటూ బాత్రూంలోకి పరుగెత్తి వెళ్లి గడ్డి మందు తాగేసింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి, మళ్ళీ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. కోలుకోలేక సోమవారం మరణించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎక్కడైనా పెళ్లయిన కూతుళ్లు పుట్టింటికి వెళ్లే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు కానీ, కుమారి మాత్రం పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవడం వింతగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.