A devotee walked 6500 kilometers and reached Mecca
mictv telugu

6500 కిలోమీటర్లు నడిచి మక్కా చేరుకున్న భక్తుడు

July 11, 2022

సాధారణంగా హిందూ భక్తులు తిరుమల లేదా ఇతర పుణ్య క్షేత్రాలకు పాదయాత్ర చేస్తుంటారు. కానీ ముస్లింలు ఇలాంటివి చేయడం కొంత అరుదుగానే చెప్పాలి. అయితే బ్రిటన్‌కు చెందిన అడం మొహమ్మద్ మాత్రం తన దేశం నుంచి మక్కా వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాడు. 6500 కిలోమీటర్ల దూరాన్ని 10 నెలల 25 రోజులలో చేరుకున్నాడు. ప్రతీ రోజు సగటున 17.8 కిలోమీటర్లు నడక సాగించాడు. 52 ఏళ్ల వయసున్న ఆయన నెదర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్‌ల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. గతేడాది ఆగస్టు 1న ప్రారంభమైన ఈ యాత్ర గత నెలలో సౌదీ అరేబియా చేరుకోవడంతో ముగిసింది. అక్కడికి చేరుకున్న తర్వాత మంత్రి మాజిద్ బిన్ అబ్దుల్లా అల్ కసాబి ఆడంకి ఆతిథ్యం ఇచ్చి హజ్ పర్మిట్‌ను ఇప్పించారు. ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడుతూ..‘నేను ఈ పని కీర్తి కోసమో, డబ్బు కోసమో చేయలేదు. జాతి, మతం, రంగు వంటి భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటేనని ప్రపంచానికి చాటడానికి యాత్ర చేశాను. ఇస్లాం బోధించే శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడమే నా పర్యటన లక్ష్యం’ అని వెల్లడించారు. కాగా, ఈ ప్రయాణంలో ఆడమ్ తన పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు టిక్‌టాక్‌లో అప్డేట్ చేయగా, అతనికి మిలియన్ల మంది ఫాలోయర్లు వచ్చి చేరారు. ఖర్చుల కోసం గోఫండ్ మీ అని ఓ పేజీని క్రియేట్ చేశాడు. దారి పొడుగునా ఇస్లామిక్ పారాయణాలు పఠించాడు.