నగరవాసులను ఇప్పుడు కుక్కలు భయపెడుతున్నాయి. వీధికుక్కల స్వైరవిహారం మనుషుల ప్రాణాల మీదకి తెస్తోంది. అంబర్‌పేటలో చిన్నారి ప్రదీప్‌ని చంపేసిన కుక్కలు తాజాగా చైతన్యపురిలో మరో బాలుడిపై దాడి చేశాయి. నోటితో బాలుడి తలపై ఉన్న వెంట్రుకలను బలవంతంగా పీకేశాయి. దాడిని అడ్డుకోబోయిన మరో బాలుడిని కూడా కరవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పిల్లలను రోడ్లపైకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది.
అటు అంబర్ పేట ఘటన వైరల్ కావడంతో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగంలో కదలిక వచ్చింది. నగరవ్యాప్తంగా ఉన్న వీధికుక్కలను పట్టుకుని రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం, స్టెరిలైజ్ చేయడం చేస్తున్నారు. కుక్కల చెవులకు వీ షేప్‌లో కట్ ఉంటే స్టెరిలైజ్ చేసినట్టు భావించాలని, దాని తర్వాత ఏఆర్‌వీ ఇంజెక్షన్ ఇస్తామని అధికారులు చెప్తున్నారు.
ఇలా నగరంలో మొత్తంగా ఉన్న 5 లక్షల 75 వేల కుక్కల్లో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా కుక్కలకు స్టెరిలైజ్ చేశామని వెల్లడిస్తున్నారు. అటు నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 500కి పైగా కరిచే కుక్కలను పట్టుకున్నట్టు ఆ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే జిల్లాలు, గ్రామాల్లో కూడా గ్రామసింహాల బెడద ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పిల్లలు, వృద్ధులను గమనించి సామూహికంగా దాడి చేస్తున్నాయి. దీంతో ఎటు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోననే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.