ఐఫా వేడుకల్లో కుక్క.. సల్మాన్ ఖాన్ వెనకాలే నక్కి నక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐఫా వేడుకల్లో కుక్క.. సల్మాన్ ఖాన్ వెనకాలే నక్కి నక్కి..

September 19, 2019

ఐఫా అవార్డు సంబరాలు ముంబైలో బుధవారం గ్రాండ్‌గా జరిగాయి. బాలీవుడ్ నుంచి నటీ నటులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. సెలబ్రెటీలతో అంతా సందడిగా ఉన్న సమయంలో ఓ కుక్క అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కిందా మీదపడి దాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారంతా పడి పడి నవ్వుకుంటున్నారు.

ఐఫా వేడుకలకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నేవీ బ్లూ సూట్ ధరించి చాలా స్టైలిష్‌గా నడుచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఆయన వెనకాలే ఓ కుక్క నక్కి నక్కి మెల్లగా లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఈవెంట్ నిర్వాహకులు అది లోపలికి రావడాన్ని గమనించి దానిని పట్టుకుని బయట వదిలారు. ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా ఎంతో మంది తారల నడుమ ఈ శునకం ఒక్కసారిగా హైలెట్‌గా నిలిచింది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని అంతా అంటారు. ఈ కుక్కకు ఈ రోజు వచ్చింది. సెలబ్రెటీల మధ్య దర్జాగా తిరిగింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.