కుక్క కోసం రూ.42 కోట్లు ఖర్చుపెట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క కోసం రూ.42 కోట్లు ఖర్చుపెట్టాడు..

February 3, 2020

dog

పెంపుడు జంతువులను కొందరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వాటికి ఏమైనా అయితే తల్లడిల్లిపోతారు. ‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ కూడా అలాంటి వారిలో ఒకరు. తాజాగా అనారోగ్యానికి గురైన తన పెంపుడు కుక్కను కాపాడిన వెటర్నరీ డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కోట్లు ఖర్చుపెట్టారు.

డెవిడ్ మ్యాక్‌నైల్.. గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కను పెంచుకుంటున్నారు. దానికి స్కౌట్‌ అని పేరు పెట్టారు. స్కౌట్‌ గతేడాది తీవ్ర అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే దాని గుండెలో గడ్డ ఉందని, రక్తంలో క్యానర్ కణాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అది బతికే అవకాశాలు కేవలం ఒక శాతమే ఉన్నాయన్నారు. దీంతో డెవిడ్ మ్యాక్‌నైల్ స్కౌట్‌ను యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌‌లో చేర్చారు. అక్కడ డాక్టర్లు దానికి కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ, ఇమ్యునోథెరఫీ అందించారు. దీంతో గడ్డ 90 శాతానికి కరిగిపోయి స్కౌట్ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ‘యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌’ డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పేందుకు డెవిడ్ మ్యాక్‌నైల్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికాలోని సూపర్ బౌల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రకటన కోసం రూ.42,93,63,000 ఖర్చుపెట్టారు. కుక్కల్లో ఏర్పడే క్యాన్సర్ గురించి అవగాహన కలిపిస్తూ రూపొందించిన ఈ ప్రకటనలో స్కౌట్‌కు అందించిన చికిత్స గురించి తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ఆ వెటర్నరీ స్కూల్‌కు విరాళాలు లభిస్తాయని ఆశిస్తున్నానని డెవిడ్ మ్యాక్‌నైల్ పేర్కొన్నారు.