A drunken man stole an RTC bus to go home in AP
mictv telugu

ఇంటికెళ్లేందుకు ఆపి ఉన్న ఆర్టీసీ బస్సును వేసుకెళ్లిన మందుబాబు

August 10, 2022

మద్యం మత్తులో ఉండి, అర్ధరాత్రి వేళ తన ఇంటికెళ్లేందుకు ఏ వాహనం లేకపోవడంతో నిలిపి ఉన్న నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును వేసుకెళ్లాడా వ్యక్తి. విషయం తెలియని ఆ బస్సు డ్రైవర్, కండక్టర్.. తెల్లారి వచ్చి చూసి సరికి బస్సు కనిపించకపోవడంతో షాకయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్‌ బస్సు.. సోమవారం రాత్రి రాజాం నుంచి వంగర చేరుకుంది. ఆ తర్వాత విద్యార్థులను దింపేసి.. బస్సును డ్రైవర్‌ పి.బుజ్జి వంగర పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిలిపారు. ఉదయం నాలుగు గంటల సమయంలో కనిపించకపోవడంతో సహచరుల సహాయంతో గ్రామంలో వెతికారు. అనంతరం వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సమాచారాన్ని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావుతో పాటు డిపో సీఐ లక్ష్మణరావుకు తెలియజేయడంతో వారు వంగర పోలీస్‌ స్టేషన్‌కు మంగళవారం వెళ్లారు. కొన్ని గంటల తరువాత రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోలపేట సమీపంలో ఉన్నట్లు తెలుసుకొని వంగర పోలీసులతో రాజాం సీఐ కె.రవికుమార్‌, ఆర్టీసీ అధికారులు చేరుకున్నారు. వేలిముద్రల సేకరణ అనంతరం బస్సును వంగర ఠాణాకు తీసుకువచ్చారు. అనుమానితులను రాజాం పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. అయితే పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి మద్యం తాగి సోమవారం రాత్రి ఆ బస్సులోనే వంగర చేరుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత గోకర్ణపల్లిలోని తన ఇంటికి వెళ్లడానికి మరే వాహనంల లేకపోవడంతో.. పీఎస్ ముందు నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సునే తీసుకువెళ్లినట్లు పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.