A Dutch court has sentenced three people who shot down a Malaysian airliner to life imprisonment
mictv telugu

విమానం కూల్చి 298 మంది చావుకు కారణమైన ముగ్గురికి యావజ్జీవ శిక్ష

November 18, 2022

సుమారు పది దేశాలకు చెందిన పౌరులు ప్రయాణిస్తున్న విమానాన్ని మిస్సైల్ ప్రయోగించి పేల్చేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ ప్రమాదంలో 298 మంది విమానంలోనే సజీవ దహనమయ్యారు. ఈ కేసును ఎనిమిదేళ్లు విచారించిన కోర్టు ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆలస్యంగానైనా తీర్పు వచ్చినందుకు బాధితుల బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే.. నెదర్లాండ్ లోని అమ్ స్టర్ డాం నుంచి మలేషియాలోని కౌలాలంపూర్ నగరానికి 2014 జులై 17న బోయింగ్ 777 విమానం బయల్దేరింది. ఇందులో 298 మంది ప్రయాణీకులున్నారు. ఈ విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటు వాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి పేల్చేశారు. విమానం ఉక్రెయిన భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో నెదర్లాండ్ దేశానికి చెందిన 196 మంది, మలేషియా పౌరులు 43 మంది, 38 మంది ఆస్ట్రేలియా సిటిజన్స్ ఇలా మొత్తం పది దేశాల పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటు వాదికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హర్షం వ్యక్తం చేయగా, రష్యా మాత్రం అది ఉక్రెయిన్ వేర్పాటు వాదుల పని అయ్యిండవచ్చని, మాస్కో ప్రమేయం లేదని కొట్టిపారేసింది.