A family donated a double bedroom house in siddipet
mictv telugu

డబుల్ బెడ్రూం ఇంటిని వెనక్కిచ్చేసిన కుటుంబం.. హరీష్ రావు అభినందన

August 6, 2022

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూం ఇల్లు కోసం ఇప్పటికే లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత మంది మధ్య తమకు వస్తుందో రాదో అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే లాటరీ పద్ధతిలో ఈ ఇళ్ళను కేటాయిస్తారు కనుక. అయితే సిద్దిపేటలో ఉండే ఓ కుటుంబం తమకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంటిని తిరిగిచ్చేసింది. ఎవరైనా నిరుపేదలు ఉంటే వారికి ఉపయోగపడుతుందని పేపర్లు, తాళాలను మంత్రి హరీష్ రావు చేతిలో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేటలో నివాసముండే దంపతులు రూప, కరుణాకర్ రెడ్డిలు స్థానికంగా జీవనోపాధి పొందుతున్నారు. రూప కుట్టుమిషన్ పని చేస్తే కరుణాకర్ రెడ్డి అక్కడ దొరికే చిన్నా చితకా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక్కడే కుమారుడు కావడం, అతనికి మానసిక సమస్యలుండడంతో ఉన్న ఇంటి నుంచి డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. ఉన్నది ముగ్గురే కాబట్టి తమకు కేటాయించిన ప్రభుత్వ ఇంటిని ఎవరికైనా నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయించుకుని మంత్రి హరీష్ రావుకు పట్టా కాగితాలు, తాళాలను అప్పగించారు. దంపతులు చేసిన పనిని అభినందించిన హరీష్ రావు.. వారి కుమారుడికి అవసరమైన వైద్య సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ఇళ్లను వృథాగా వదిలేయవద్దని హరీష్ కోరారు.