దీనగాథ.. రోడ్డుప్రమాదంలో సర్వం కల్పోయిన కుటుంబం..
రోడ్డు ప్రమాదం వాళ్ల జీవితాలను తలకిందులు చేసింది. తీరని విషాదాన్ని నింపింది. జీవితం అంతా వాళ్లు కుమిలి కుమిలి ఏడ్చేలా చేసింది. తమ తలరాత ఇంతే అనుకుని ఆ తల్లీ తన లోకం తెలియని కొడుకుతో ధీనమైన జీవితాన్ని వెళ్లదీస్తోంది. విధి ఇంత వక్రంగా వాళ్ల జీవితాలతో ఆడుకుంటుందా? ఒక అందమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వారిని నిస్సహాయులను చేసింది. ఎంతటి దైన్యం? రెండు కాళ్లు కోల్పోయిన మూడేళ్ల కొడుకే ఇప్పుడా తల్లికి సర్వం. ఆ కొడుకు ఆలనాపాలనా చూద్దామన్నా ఆ తల్లికి కూడా కాళ్లు చచ్చుబడిపోయాయి? ఏ చుట్టాలు, బంధువులు సాయం చేసేవాళ్లు లేరు. ప్రభుత్వం ఇచ్చే ఆ ఫించన్‌తోనే ఆమె, ఆమె కొడుకు, ఆమె వృద్ధ తండ్రి బతుకుతున్నారు.
వారిది సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్. రెండు కాళ్లు కోల్పోయిన ఆ బాబు పేరు రేహాన్. మూడేళ్ల క్రితం రేహాన్ కుటుంబం ఎంతో ఆనందంగా వుంది. ఇంతలో విధికి కన్ను కుట్టింది.. అంతే వారిని కాటేసింది. మూడేళ్ల క్రితం రేహాన్‌కు వైరల్ జ్వరం సోకింది. దీంతో సంగారెడ్డి ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తండ్రి హైదర్, తల్లి షహీదాబేగం, చెల్లి రిషాతో కలిసి వెళ్లారు. దారి మధ్యలో ద్విచక్ర వాహనం టైరు పగిలింది. దాంతో వాహనం డివైడర్‌ను ఢీకొని నలుగురూ రోడ్డుకు అవతలి వైపు ఎగిరిపడ్డారు. అదే సమయంలో ఏడాది వయసున్న రేహాన్ చిట్టి చెల్లెలు రిషా లారీ చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. రేహాన్ కాళ్లు రెండు నుజ్జునుజ్జయ్యాయి. తల్లి షహీదాబేగం కాళ్లు విరగ్గా తండ్రి హైదర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఆస్పత్రికి తరలించగా రేహాన్ రెండు కాళ్లను తొలగించారు. షహీదాకు శస్త్రచికిత్స చేసి, నాలుగు రాడ్లు వేశారు. వారి వైద్యానికి మొత్తం రూ.4 లక్షలు ఖర్చు అయింది. అయినా వారు లేచి నిలబడలేరు. నిస్సహాయంగా నేలపైనే వుండిపోవాలి. తెచ్చిన అప్పుకి వడ్డీలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో వారికి మరో దెబ్బ తగిలింది. షహీదా కాళ్లలో ఉన్న రాడ్లను తొలగించగా… ఇన్‌ఫెక్షన్ అయింది. చికిత్సకు రూ.లక్ష వరకు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఆర్థిక సమస్యలను తట్టుకోలేని ఆమె భర్త హైదర్ ఏడాది క్రితం ఇల్లు విడిచి పారిపోయాడు. ఏ దిక్కూ లేని షహీదా కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లింది.
అక్కడ తండ్రి (70ఏళ్లు) వద్ద వుండిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ఫించన్ డబ్బులతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. వీకి కుటుంబ పరిస్థితి గురించి తెలిసి హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య ఫౌండేషన్ వారు రేహాన్‌కు కృత్రిమ కాళ్లను అందించారు. అందులో ఒకటి విరిగిపోవడంతో ఫెవీక్విక్‌తో అతికించుకున్నాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో భర్తలా షహీదా దుస్థుతిలను చూసి ఎస్కేప్ అయిపోవాలని భావించలేదు. ఏదో ఆశ.. బతకాలి అన్న తపన.. జరిగినదాన్ని తలుచుకుంటూ కూర్చోకుండా చచ్చుబడ్డ కాళ్లు చేతుల్ని ఆడించాలి..బతకాలి.. అంతే.. అని గుండెను రాయి చేసుకుని కొడుకును స్కూలుకు పంపిస్తున్నారు. ఎవరైనా దయతలచి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని షహీదా కోరుతున్నారు. ఎవరు ఎంత సాయం చేసినా వారు కోల్పోయిన నష్టాన్ని మాత్రం పూడ్చలేరు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి అని పోలీసులు మొత్తుకునేది.