A fan of Rajagopal Reddy died of heart attack after seeing the exit poll details
mictv telugu

మునుగోడులో ఓడిపోతున్నామని తెలిసి అభిమాని ఆత్మహత్య

November 5, 2022

రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పోరాడిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించి గెలుపు తమదంటే తమదేననే ధీమాలో ఉన్నాయి. ఆదివారం ఈ ఎన్నిక ఫలితాలు రానుండగా, పోలింగ్ ముగిసిన వెంటనే కొన్ని సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్ సర్వేలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఈ వివరాలు బాగా వైరల్ అయ్యాయి. అన్ని సర్వేలలో టీఆర్ఎస్ గెలవబోతుందని రావడంతో తన అభిమాన వ్యక్తి ఓడిపోతున్నాడని వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. రాంనగర్ కాలనీకి చెందిన ఊదరి శంకర్ (30) అనే వ్యక్తి తల్లిదండ్రులు చనిపోవడంతో కొంతకాలంగా విద్యానగర్ కాలనీలోని తన సోదరి వద్ద ఉంటున్నాడు. మునుగోడు ఎన్నిక సందర్భంగా తన అభిమాన నేత, బీజేపీ అభ్యర్ధి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించాడు.

తమ నాయకుడు కచ్చితంగా గెలుస్తాడనే ధీమాతో ఉన్నాడు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్ వివరాలు చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9 గంటల వరకు మిత్రులతో మంచిగా మాట్లాడి ఇంటికి చేరుకున్న శంకర్.. నిద్రలోనే గుండోపోటుతో చనిపోయాడు. ఉదయం అక్కాబావలు ఎంత తలుపుకొట్టినా తీయకపోవడంతో పక్కింటి వారి సహాయంతో తలుపులు తెరచి చూడగా, విగతజీవిగా పడి ఉన్నాడు. తమ నాయకుడికి వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్ వివరాలు రావడంతో ఒత్తిడికి తట్టుకోలేక మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఫలితాలు రాకుండానే అభిమాని చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.