A farmer lost his life at MRO office for land in ap
mictv telugu

ఏపీ : భూమి కోసం ఎమ్మార్వో ఆఫీసు వద్ద ప్రాణాలు కోల్పోయిన రైతు

September 3, 2022

A farmer lost his life at MRO office for land in ap

తెలుగు రాష్ట్రాల్లో రియల్ బూమ్ వల్ల భూముల ధరలు భారీగా పెరగడంతో పాటు వివాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని లిటిగెంట్ కేసులు ఎంతకీ తెగకపోయేసరికి కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అలాంటి ఘటనే ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో జరిగింది. ఎమ్మార్వో ఆఫీసు ముందే ఓ రైతు నిరసన తెలియజేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళితే.. రామకృష్ణాపురం పంచాయితీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రత్నం అనే రైతుకి ప్రభుత్వం 1974లో లీజుకి కొంత భూమి ఇచ్చింది. కానీ, రైతుకి భూమి చెందకూడదనే దురుద్దేశంతో తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు తరచూ వివాదాం సృష్టించేందుకు ప్రయత్నించేవారు. దీంతో రత్నం 2009లో చిత్తూరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు సదరు భూమిని రత్నంకు కేటాయిస్తూ పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.

తర్వాత కండ్రిగ గ్రామస్థులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అంతేకాక, కోర్టు తీర్పును ధిక్కరించి ఆ భూమిలో పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో స్థానిక వీఆర్వో అభ్యంతరం వ్యక్తం చేయగా, రత్నం అదే రోజు తహసీల్దార్ రమణిని కలిసి విన్నవించుకున్నాడు. అక్కడే స్థానిక ప్రజాప్రతినిధితో గొడవ జరుగగా, మనస్థాపంతో రైతు అనారోగ్యం పాలయ్యాడు. తిరిగి కోలుకున్నాక శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టగా శనివారం మధ్యామ్నం స్పృహ తప్పి పడిపోయాడు. స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో కోపోద్రిక్తులైన రత్నం కుమారులు, కుమార్తె తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగి, రాజకీయ నాయకుల అండతో తమ తండ్రిని హత్య చేశారని ఆరోపించారు.