మహారాష్ట్రలోని వింత ఘటన చోటుచేసుకుంది. తనకు రూ. 6 కోట్లు లోన్ కావాలంటూ తక్టోడా గ్రామానికి చెందిన కైలాష్ పతంగే అనే రైతు బ్యాంకులో దరఖాస్తు చేశాడు. అయితే వ్యవసాయం కోసం అనుకుంటే పొరపాటు. హెలికాప్టర్ కోసం. వ్యవసాయం భారంగా మారి రోజురోజుకీ అప్పులు పెరిగిపోతున్నాయని, గతేడాది తనకున్న రెండెకరా పొలంలో సోయాబీన్ వేస్తే వర్షాలు రాక పంట నష్టపోయానన్నాడు. తర్వాత పంట బీమా కూడా రాలేదని వాపోయాడు.
ఈ క్రమంలో వ్యవసాయం బదులు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్టు వెల్లడించాడు. అయితే ప్రతీ వ్యాపారంలో పోటీ ఉంటుంది కనుక హెలికాప్టర్ కొనుక్కొని అద్దెకిచ్చుకుంటే గిట్టుబాటవుతుందనే ఆశతో వచ్చానని తెలిపాడు. ధనం ఉన్న వ్యక్తులు మాత్రమే కలలు కనాలని ఎవరు చెప్పారు. రైతులు కూడా పెద్ద కలలు కనొచ్చు. వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయవచ్చు. అందుకు బ్యాంకు వారి సహకారం కావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం బ్యాంకు వారి వంతైంది.