పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ప్రశ్నిస్తే చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు. కని పెంచిన పిల్లలకంటే పరువుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. కట్టుకున్న భర్త వద్దకు వెళ్లడం లేదనే కోపంతో కుమార్తెను కిరాతకంగా హత్య చేశాడు తండ్రి. రెండు వారాల తర్వాత బయటపడిన ఈ ఘటన నంద్యాల జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్నకు ఏడాదిన్నర క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. కూతురు, అల్లుడు హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. ప్రసన్న పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించడంతో భర్తపై అయిష్టంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె ఇటీవల హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చేసింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. తండ్రి ఎంత చెప్పినా వినలేదు. దీంతో కుటుంబంలో, గ్రామంలో తన పరువు పోతుందని భావించినా
దేవేంద్రరెడ్డి ప్రసన్నను హత్య చేశాడు. ఈనెల 10వ తేదీన ఇంట్లో గొంతునులిమి చంపేశాడు. తర్వాత మరికొందరితో కలిసి కారులో నంద్యాల- గిద్దలూరు మార్గంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తలను, మొండెంను వేరు చేసి పారివేశాడు. వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టు ఇంటికి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించాడు.
ప్రసన్న నుంచి ఫోన్ రాకపోవడంతో ఆమె తాత శివారెడ్డికి అనుమానం వచ్చి దేవేంద్రరెడ్డిని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. కూతురి వల్ల తన పరుపు పోయిందని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాలు ప్రకారం ప్రసన్న తల, మొండెం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.