A female councilor complained that the WhatsApp group was hijacked
mictv telugu

జడ్చర్ల : వాట్సాప్ గ్రూపును కబ్జా చేశారని మహిళా కౌన్సిలర్ ఫిర్యాదు

September 1, 2022

తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల పోలీసులకు గురువారం వింత ఫిర్యాదు అందింది. తాను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపును కబ్జా చేసి తననే గ్రూపు నుంచి తొలగించారంటూ ఓ మహిళా కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై ఎలా స్పందించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు.

మొట్టమొదటి సారి వచ్చిన ఈ కేసు వివరాల్లోకెళితే.. జడ్జర్ల మునిసిపాలిటీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారంట. అందులో కౌన్సిలర్లందరూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో 25వ వార్డుకు చెందిన మరో మహిళా కౌన్సిలర్ తనను గ్రూపులో జాయిన్ చేయాలని కోరడంతో సరేనని గ్రూప్ క్రియేట్ చేసిన కౌన్సిలర్ జాయిన్ చేసింది. అయితే తర్వాత కొత్తగా గ్రూపులో జాయిన అయిన కౌన్సిలర్ గ్రూప్ అడ్మిన్, గ్రూప్ సృష్టికర్త అయిన మహిళా కౌన్సిలర్‌నే గ్రూపు నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మహిళా కౌన్సిలర్ పోలీసులను ఆశ్రయించింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారని, దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదని పోలీసులు వాపోతున్నారు. అయినా, బాధితురాలికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.