పెళ్లింట్లో ఘోరం.. ముగ్గురు తోబుట్టువులు సజీవ దహనం
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు సజీవదహనమయ్యారు. లస్కర్ డ్యామ్ ఆదివాసీ పాడాలో హప్నా సోరెన్ తన కుమారుడు మంగళ్ సోరెన్తో కలిసి నివసిస్తున్నాడు. మంగళ్ సోరెన్కు ఇటీవలె పెళ్లి నిశ్చయమైంది. దీంతో అతడి అక్క సుమీ సోరెన్, చెల్లి సుకుమని ఇంటికి వచ్చారు.
ఈ క్రమంలో ముగ్గురు తోబుట్టువులు ఒకే గదిలో పడుకోగా తండ్రి వేరే గదిలో పడుకున్నారు. అయితే అకస్మాతుగా మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనమయ్యారు. ఉదయం హప్నా సోరేన్ లేచే సరిగా ఇళ్లంతా కాలిపోయి ఉండగా.. తన కుమారుడి గది నుంచి ఎటువంటి అలికిడి లేదు. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. ముగ్గురు విగతజీవులుగా కన్పించారు. దీంతో హప్నా సోరెన్ బోరున విలపించారు. కాగా తోబుట్టువులు ఆత్మహత్య చేసుకున్నారా..లేక ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.