థాయిలాండ్లో గాలంతో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి చేప ఝలకిచ్చింది. గాలానికి చిక్కిందని సంతోషంతో పైకి లాగిన జాలరి నోట్లోకి డైరెక్టుగా వచ్చేసింది. ఊహించని పరిణామంతో షాకయిన జాలరి చేపను బయటికి తీయడానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. మే 22న జరిగినట్టుగా చెప్తున్న ఈ సంఘటన గురించి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. జాలరి అయిన ఓ వ్యక్తి స్థానికులతో కలిసి సమీపంలో ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చెరువులో గాలం వేయగా, ఓ చేప చిక్కిందని భావించి సంతోషంతో దాన్ని పైకి లాగాడు.
ఇంతలో ఊహించని రీతిలో నీటిలోంచి పైకి ఎగిరిన చేప డైరెక్టుగా జాలరి నోట్లోకి దూరి అన్నవాహిక, శ్వాస నాళాల మధ్య ఇరుక్కుపోయింది. దాంతో శ్వాస తీసుకోవడానికి జాలరి తీవ్ర ఇబ్బంది పడడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్ చేసి చూడగా, అనాబాస్ అనే చేప గొంతులో ఇరుక్కున్నట్టు గుర్తించారు. వైద్యులు చాలా కష్టపడి, జాలరి అంతర్గత అవయవాలకు ఎలాంటి నష్టం జరుగకుండా జాగ్రత్తగా చేపను బయటికి తీశారు. అనంతరం ఆపరేషన్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ..‘ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదు. చేపను బయటికి తీయడానికి చాలా కష్టపడ్డాం. ఆపరేషన్ సక్సెస్ అయింది. జాలరి ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడి నెమ్మదిగా కోలుకుంటున్నాడు’ అని చెప్పారు.