ఉక్రెయిన్‌లో రష్యా భారీ విధ్వంసం చేస్తున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల పౌరులు ఆ దేశానికి మద్ధతుగా సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. రష్యాను నిందిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు నేరుగా ఉక్రెయిన్‌కి వెళ్లి రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాడు. వివరాల్లోకెళితే.. బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ సైనికుడు తన కుటుంబంతో కలిసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. అలాంటి సమయంలో రష్యా, ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను చూసి కలత చెంది, ఉక్రెయిన్ దేశానికి అండగా నిలవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వాకింగ్‌కు వెళ్తున్నానని భార్యకు అబద్దం చెప్పి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాడు. పోలండ్ విమానం ఎక్కి ఆదేశంలో దిగిన తర్వాత ఓ సరిహద్దు గ్రామం గుండా ఉక్రెయిన్‌లోకి ఎంటరయ్యి, యుద్ధంలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆవ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను బ్రిటీష్ రిటైర్డ్ సోల్జర్ను. జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చా. ఎవ్వరికీ అప్పు లేను. ఉక్రెయిన్ ప్రజల కష్టాలు చూసి వారికి సహాయం చేయాలనిపించింది. అందుకే వచ్చేశా. నా నిర్ణయాన్ని చూసి నా భార్య చాలా కోపానికి గురై ఉంటుంది. పరిస్థితులు చక్కబడి ప్రాణాలతో తిరిగి ఇంటికెళితే సంతోషిస్తా’నంటూ చెప్పుకొచ్చారు.