A four-year-old boy died after being attacked by stray dogs in Hyderabad
mictv telugu

హైదరాబాద్‌లో విషాదం.. పసివాణ్ని చంపేసిన వీధి కుక్కలు

February 21, 2023

A four-year-old boy died after being attacked by stray dogs in Hyderabad

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు వెంటపడి కరిచి చంపాయి. . శునకాల దాడి నుంచి ఆ బాలుడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్.. నాలుగేళ్ల క్రితం హైదరాబాదుకు ఉపాధి నిమిత్తం వలస వచ్చాడు. అంబర్‌పేటలో ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 8 యేళ్ల కుమార్తె, 4 యేళ్ల కుమారుడు ప్రదీప్ ఉన్నారు. వీరంతా బాగ్ అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నారు.

అయితే, ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటరుకు గంగాధర్ తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ఏరియాలో ఉంచి కుమారుడిని మాత్రం లోపలికి తీసుకెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఆడుకుంటుండగా గంగాధర్ మాత్రం తన పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో బాలుడు అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. దీంతో భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి అటూ ఇటూ పరుగెత్తాడు. కానీ, ఎంతకీవదలని శునకాలు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి దాడి చేయడంతో ఆ బాలుడు కిందపడిపోయాడు. ఒక దశలో ఓ కుక్క కాలు..మరొకటి చేయి నోటకరచుకుని చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తమ్ముడు ఆర్తనాదాలు విన్న అక్క తండ్రికి విషయం చెప్పడంతో అతను పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కలదాడిలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రదీప్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.