గత మంగళవారం అమెరికాలో సాల్వడార్ రామోస్ అనే యువకుడు తుపాకీతో పాఠశాలలోకి ప్రవేశించి 19 మందిని చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిందితుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. అయితే ఈ దారుణ సంఘటన నుంచి అదే స్కూలుకు చెందిన చెందిన మియా అనే నాలుగో తరగతి చదివే ఓ బాలిక తప్పించుకుంది. తాను ఎలా తప్పించుకుందో పదకొండేళ్ల మియా తన తండ్రితో ఇలా చెప్పుకొచ్చింది. ‘డాడ్.. మా ఫ్రెండ్స్‌ను, టీచర్లను చంపేశారు. నన్ను కూడా చంపేస్తాడేమోనని భయంతో చనిపోయిన వారి రక్తం ఒంటిపై చల్లుకొని కింద పడి పోయా. చనిపోయినట్టు నటించా. దాంతో నన్నొదిలేసి వెళ్లిపోయాడు’ అని తన దారుణ అనుభవాన్ని వెల్లడించింది.
దుండగుడు క్లాసు నుంచి వెళ్లిపోగానే వెంటనే మియా తన టీచరు ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు దుండగుడిని కాల్చి చంపేశారు. కాగా, తన కూతురు మానిసిక పరిస్థితి గురించి మియా తండ్రి ఆందోళన చెందుతున్నాడు. దుండగుడిని పోలీసులు మట్టుబెట్టినా మియా అతడి గురించి భయపడుతూనే ఉంది. ఆ రోజు రాత్రి మియా ‘డాడీ నువ్వు కూడా ఓ తుపాకీ తెచ్చుకో. ఆ గన్‌మన్ మళ్లీ వస్తాడు’ అని చెప్తుంటే మనసు కోసినట్టనిపించిందని తండ్రి మిగుల్ మీడియాకు తెలిపాడు. తన కూతురిపై పడిన మానసిక ప్రభావాన్ని ఎలా పోగొట్టాలో తెలియట్లేదని మిగుల్ ఆవేదన చెందుతున్నాడు. కాగా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండగా, అమెరికాలోని తుపాకీ కల్చర్‌పై పలువురు విమర్శిస్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా తుపాకీ లైసెన్స్‌ల గురించి పునరాలోచించాలని చట్టసభ సభ్యులను కోరాడు.