A groom demands a virginity test of the bride in bihar
mictv telugu

కూతురి సంతోషానికి హామీ అడిగిన పేరెంట్స్.. అల్లుడి రియాక్షన్ ఇదీ

November 23, 2022

బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా మోతిహరిలోని ఓ పెళ్లిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహం తర్వాత వధూవరుల మధ్య గొడవ జరిగింది. చివర్లో అప్పగింతల సమయంలో వధువు పేరెంట్స్ అత్తవారింట్లో తమ కూతరు సంతోషంగా ఉంటుందనే హామీతో పేపర్ మీద రాసివ్వాలని అల్లుడిని డిమాండ్ చేశారు. చిర్రెత్తుకొచ్చిన అల్లుడు వారి ముందు షాకింగ్ డిమాండ్ పెట్టాడు.

అది సక్సెస్ అయితేనే హామీ ఇవ్వగలనని పేచీ పెట్టడంతో అక్కడున్నవారంతా మొదట ఆశ్చర్యపోయి తర్వాత వరుడి తరపు బంధువులను రెండ్రోజుల పాటు బంధించారు. వివరాల్లోకెళితే.. నవంబర్ 16న ఓ జంటకు పెళ్లి జరుగగా, ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న వధువు తల్లిదండ్రులు మరుసటి రోజు అప్పగింతల సమయంలో అనూహ్య డిమాండ్ ని వరుడి ముందు పెట్టారు. అత్తారింట్లో తమ కూతురికి ఎలాంటి ఇబ్బంది రాదని పేపర్ మీద రాసి హామీ ఇవ్వాలని కోరారు. దీంతో కోపోద్రిక్తుడైన వరుడు.. మీ కూతురు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని, అందులో సక్సెస్ అయితేనే కాపురానికి తీసుకెళ్తానని తెగేసి చెప్పాడు. ఈ మాటలు విన్న వధువు తరపు బంధువులు వరుడితో పాటు వారి బంధువులను రెండ్రోజుల పాటు తమ గ్రామంలోనే బంధించారు.

అనంతరం పోలీసుల చొరవతో విడుదల చేశారు. చివరికి వధువు వరుడితో అత్తారింటికి వెళ్లకపోవడం గమనార్హం. కాగా, బీహార్ లో కన్యత్వ పరీక్షకు డిమాండ్ పెరుగుతోందని గణాంకాలు చెప్తున్నాయి. పట్నాలో దీని కోసం సర్జరీ చేయించుకునేందుకు యువతులు, మహిళలు ఆసక్తి చూపుతున్నారని హిమాన్ష్ రాయ్ అనే వైద్యుడు తెలిపారు. పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్న వారు శస్త్రచికిత్సల ద్వారా తమ కన్వత్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నారని వెల్లడించారు. దీనికి వితంతువులు కూడా మినహాయింపు కాదన్నారు.