మరి కొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకొని, వస్తున్న నెల జీతం తక్కువనే బాధలో ఉన్న వరుడు చేసిన పనికి రెండు కుటుంబాల సభ్యులు షాక్ తిన్నారు. వివరాలు.. విశాఖలోని మల్కాపురం జయేంద్ర కాలనీలో నివాసముంటున్న దినేష్ హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఒక్కడే కొడుకు కావడంతో పెళ్లి చేయాలనే ఉద్దేశంతో పెందుర్తి ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి కుదిర్చారు.
ఎంగేజ్ మెంట్ ఘనంగా చేసి ముహూర్తం పెట్టుకున్నారు. బుధవారం పెళ్లి జరగాల్సి ఉండగా, మంగళవారం రాత్రి రెండు గంటల వరకూ అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయి మెల్లగా అందరూ పడుకున్నారు. ఆ తర్వాత గదిలోకి వెళ్లిన వరుడు దినేష్ ఉరి వేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తల్లిదండ్రులకు అంతుబట్టలేదు. ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకోననీ కానీ, పెళ్లి వద్దనీ కానీ చెప్పలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలిసిన వధువు, వారి కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్నారు. అయితే వరుడి బంధువులు, సన్నిహితులు చెప్తున్న ప్రకారం.. తనకు వచ్చే జీతం తక్కువనీ, పెళ్లి తర్వాత పెళ్లాన్ని పోషించడానికి సరిపోదనీ, ఆర్ధిక ఇబ్బందుల గురించి ఆందోళన చెందేవాడని చెప్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.