A huge explosion on the sun
mictv telugu

సూర్యునిపై భారీ విస్ఫోటనం.. 3 లక్షల కి.మీల మేర వ్యాప్తి

August 3, 2022

సూర్యునిపై శాస్త్రవేత్తలకే దిమ్మతిరిగే పరిణామం చోటుచేసుకుంది. తూర్పు భాగంలో అత్యంత భారీ విస్ఫోటనం సంభవించింది. దీని నుంచి వెలువడుతున్న ప్లాస్మా భూమికి, చంద్రుని మధ్య ఉన్న దూరం 3 లక్షల 25 వేల కిలోమీటర్ల మేర విస్తరించిందని వెల్లడించారు. దీంతో వర్ణించడానికి శాస్త్రవేత్తలకు సైతం మాటలు రావడం లేదు. చివరగా దీనికి గినార్మస్ ఇరప్షన్ అనే పేరు పెట్టారు. అయితే ఈ విస్ఫోటనం ప్రభావం భూమిపై ఉండదని హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఇది సూర్యునికి మరొక వైపు ఉంది. మొదటగా దీనిని కెంటకీ, రిచర్డ్ ఎన్ ష్రాంట్జ్ గుర్తించగా, స్పేస్ వెదర్. కామ్ చిత్రాలను విడుదల చేసింది.

ఈ గినార్మస్ కుడి భాగం చాలా అస్థిరంగా ఉందనీ, అది ఏ క్షణమైనా కుప్పకూలవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సాధారణంగా పదార్ధాలను ఘన, ద్రవ, వాయు స్థితుల్లో పేర్కొంటారు. ఇవికాక, నాలుగో దానిని ప్లాస్మా అంటారు. దీనిలో అత్యంత భారీ ఉష్ణోగ్రతతో నిండిన వాయువు ఉంటుంది. దీనిలోని అణువులు ఎలక్ట్రాన్లు, ఆయాన్లుగా విడిపోయి దేనికదే స్వతంత్రంగా కదులుతాయి. ఇది కాక, సన్ స్పాట్ఏఆర్ 3068 వేగంగా కదులుతోంది. బీటా గామా అయస్కాంత క్షేత్రం వృద్ధి చెందే పరిస్థితులుండడంతో మధ్యతరహా జ్వాలలు రేగే అవకాశం ఉంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాలపై ప్రభావం చూపగలిగే రేడియో బ్లాక్అవుట్స్ ఏర్పడతాయి. ఇక్కడ పేలుళ్లు జరిగితే నేరుగా భూమిపై ప్రభావం చూపుతాయని స్పేస్ వెదర్ స్పష్టం చేసింది.