A huge terror conspiracy busted in Kashmir..Rs. 30 thousand was given and sent
mictv telugu

కశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..రూ.30 వేలు ఇచ్చి పంపారు

August 25, 2022

ఇండియన్‌ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఈ కుట్రలో భాగమైన పాకిస్తాన్ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ను ప్రాణాలతో పట్టుకుంది. ఈ కుట్రకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ అధికారులు బుధవారం వెల్లడించారు.

”ఈ ఘటన రాజౌరీ జిల్లా నౌషెరా రీజియన్‌లోని ఝంగర్‌ సెక్టార్‌ పరిధిలో ఈనెల 21న జరిగింది. లామ్‌ సెక్టార్‌లో 22 రాత్రి జరిగిన మరో ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు ల్యాండ్‌మైన్‌ పేలుడులో మరణించారు. ఉగ్రవాదులు మైన్‌ఫీల్డ్‌లోకి ప్రవేశించడంతో, ల్యాండ్‌మైన్లు యాక్టివేట్‌ అయి, పేలుడు జరిగింది. ఝంగర్‌ సెక్టార్‌ పరిధిలోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు గుర్తించారు. వారిలో ఒక చొరబాటుదారుడు ఇండియన్‌ పోస్టు సమీపానికి రావడంతోపాటు, ఫెన్సింగ్‌ను కట్‌ చేసే ప్రయత్నం చేయగా, వెంటనే జవాన్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గాయపడిన ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాం” అని అన్నారు.

అనంతరం పట్టుబడిన ఆ ఉగ్రవాదిని భారత సైన్యం విచారించగా..పలు సంచలన విషయాలు వెల్లడైయ్యాయి. ”అతడు పీవోకేలోని కోటిల్ జిల్లాకు చెందిన తబ్రక్ హుస్సేన్‌గా గుర్తించాం. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కర్నల్ యూనస్ చౌడీ అనే వ్యక్తి..అతడికి 30 వేల పాకిస్థానీ రూపాయలు ఇచ్చి, భారత్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు పంపించాడు. ఆగస్టు 21 కంటే ముందు హుస్సేన్ భారత సరిహద్దు వద్ద రెక్కీలు నిర్వహించాడు. 2016లో తబ్రిక్ హుస్సేన్ అతడి సోదరుడు భారత్‌లోకి చొరబడ్డారు. అప్పట్లో సైన్యం వీరిని అరెస్టు కూడా చేసింది. కానీ, ఆ తర్వాత మానవీయ కారణాలతో వారిని తిరిగి పాకిస్థాన్‌కు పంపించింది. కానీ, అతడు బుద్ధి మార్చుకోకుండా ఈసారి పాక్ కర్నల్ వద్ద డబ్బు తీసుకొని, తిరిగి భారత్‌పై ఆత్మాహుతి దాడికి వచ్చాడు” అని తెలిపారు.