మిలిటెంట్ తగాదాలతో అట్టుడుకుతున్న కాంగోలో ఆయా గ్రూపుల ఘోరాలు దారుణంగా ఉంటున్నాయి. తమ నిర్బంధంలో ఉన్న వారికి మనుషుల మాంసాన్ని ఆహారంగా పెడుతున్నారు. ఈ విషయాన్ని కాంగోలో మానవ హక్కుల కోసం పోరాడే సంస్థ ప్రెసిడెంట్ లుసెంజే.. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి ముందు వివరించారు. 15 దేశాల సభ్యుల ముందు లుసేంజే.. కాంగోలో ఓ మహిళ ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని వివరించింది. ‘ఒక మహిళ కిడ్నాపుకు గురైన తన కుటుంబ సభ్యుడిని విడిపించుకోవడానికి వారడిగిన డబ్బుతో వెళ్తుండగా, మార్గమధ్యంలో ఆమెను ఓ మిలిటెంట్ గ్రూపు కిడ్నాప్ చేసింది. ఒకరి తర్వాత ఒకరు ఇలా చాలా మంది ఆమెపై అత్యాచారం చేశారు. అంతేకాక, ఆ గ్రూపు ఓ వ్యక్తిని చంపి, అతని మాంసాన్ని మహిళ చేత వండించారు. దానిని నిర్భంధంలో ఉన్నవారి చేత తినిపించారు. అక్కడినుంచి బయటపడ్డ ఆ మహిళ ఇంటికి వెళ్తుండగా, మరో గ్రూపు ఆమెను కిడ్నాప్ చేసింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఎలాగోలా తప్పించుకున్న ఆ మహిళ జరిగిన దారుణాన్ని నాతో చెప్పుకుంది’ అంటూ వివరించింది. కాగా, కాంగోలో ఖనిజాలు, భూములు ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ ఇలా గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరాటాలు చాలా కామన్‌గా జరుగుతుంటాయి.