ఉద్యోగాలు ఊడుతున్న వేళ.. ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పిన వంద కంపెనీలు - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగాలు ఊడుతున్న వేళ.. ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పిన వంద కంపెనీలు

November 28, 2022

ఆర్దికమాంద్యం భయాలతో పలు అగ్రశ్రేణి టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ పొదుపు చర్యలు ప్రారంభించాయి. ఇప్పుడున్న ఉద్యోగులు కూడా తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోననే ఆందోళనలో ఉన్నారు. ఈ భయాలు ఇతర రంగాలకు కూడా పాకుతున్న తరుణంలో బ్రిటన్ లోని వంద కంపెనీలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు ఉంటాయని, ఈ విధానాన్ని నిజాయితీగా అమలు చేస్తామని ప్రకటించాయి. వీటిలో బ్యాంకింగ్ దిగ్గజం ఆటమ్ బ్యాంక్, మార్కెటింగ్ దిగ్గజం అవిన్ లు ఉండడం గమనార్హం.

ఈ వంద కంపెనీల్లో మొత్తం 2600 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, జీతాలు తగ్గించకుండా, పని గంటలు పెంచకుండా ఈ ఫోర్ డే వీక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పాలసీ కంపెనీకి, ఉద్యోగులకు లాభదాయకంగా ఉందని, కస్టమర్లకు కంపెనీతో బలమైన సంబంధాలు కలుగుతాయని ఆశిస్తున్నాయి. ఇప్పుడున్న పని విధానం ఒకప్పటి ఆర్ధిక వ్యవస్థ తాలూకు అవశేషమని ఈ ఫోర్ డే వీక్ మద్దతుదారులు చెప్తున్నారు. వారానికి సరిపడా పని నాలుగు రోజుల్లోనే పూర్తవుతుందని, పనిగంటలు పెంచకుండానే ఇది సాధ్యపడుతుందని వారు ఉదహరిస్తున్నారు. ఈ దశాబ్దం చివరికల్లా ప్రపంచంలోని మెజారిటీ కంపెనీలు ఈ నాలుగు పనిదినాలకు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.