మహిళలను అత్తింటివారి వేధింపుల నుండి రక్షించేందుకు తీసుకువచ్చిన గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతోందని ఆరోపిస్తూ భార్యా బాధితుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు మహిళలు భర్తతో పాటు అత్తింటివారిని వేధిస్తున్నారని… వెంటనే దీన్ని సవరించాలని భార్యా బాధితులు కర్ణాటక రాజధాని బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు.
‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ స్వచ్చంద సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు నిన్న(శనివారం) నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఇవాళ(ఆదివారం) సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుందని భార్యా బాధితులు వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.
గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.