A husband ran away from home after the birth of twins for the fifth time
mictv telugu

వరుసగా 5వ సారి కవల పిల్లలు.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే

July 21, 2022

ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదవ కాన్పులోనూ ఆ మహిళకు కవల పిల్లలు పుట్టారు. దీంతో బేంబేలెత్తిన భర్త ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మొత్తం పిల్లల సంఖ్య పదిమందికి చేరడంతో ఆ భర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకెళితే.. ఆఫ్రికాలోని పేద దేశమైన ఉగాండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులైన స్లాంగో, నాలోంగో గ్లోరియాలకు మొదటగా వరుసగా మూడు సార్లు కవల పిల్లలు పుట్టారు. దీంతో పిల్లల సంఖ్య ఆరుకు చేరగా అంతమందిని పోషించలేనని, పుట్టిన పిల్లలు చాలు ఇంటినుంచి వెళ్లిపొమ్మని భార్యను ఆదేశించాడు. కానీ, పిల్లల మీద మమకారంతో నాలోంగో అక్కడే ఉండిపోయింది. తర్వాత మొదటగా పిల్లలను భర్త ఎక్కడికో తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాడు. తర్వాత జరిగిన రెండు కాన్పుల్లో కూడా మళ్లీ కవల పిల్లలు పుట్టడంతో భర్త స్లాంగో ఆమెను వదిలి పారిపోయాడు. ఎక్కడికెళ్లాడో కూడా భార్యకు తెలియదు. ఇలా భర్త జాడ లేక, మొదటగా పుట్టిన పిల్లలు ఎక్కడున్నారో తెలియక నాలోంగో మానసిక వేదనను అనుభవిస్తోంది. ఇక మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా నాలోంగో ఉంటున్న ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది. వెంట ఆరుగురు పిల్లలతో ఎక్కడికెళ్లాలి? వారికి తిండి ఎక్కడి నుంచి తేవాలి? వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ విషయంపై ఆమె స్పందన అడగ్గా..‘ఇంతమంది పిల్లలను కనడంపై, నా భర్త వెళ్లిపోవడంపై నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు పిల్లలకు ఇల్లు, తిండి పెట్టడంపైనే నా ధ్యాసంతా. నా చేతుల్లో మిగిలిందేమీ లేదు. అంతా దేవుడిపైనే భారం వేశాం’ అని అభిప్రాయపడింది. కాగా, మరీ బీద దేశమైన ఉగాండాలో గర్భనిరోధక మాత్రలు, ఆరోగ్య సౌకర్యాలు అంతంత మాత్రమే.