ఆధునికత పేరుతో కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్య, భర్త అనే తేడా లేకుండా పెట్టుకుంటున్న వివాహేతర సంబంధాలతో కుటుంబాల పరువు పోయి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. అదే దారుణం అనుకుంటే ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. తిరిగి అతనితో కలిసి వచ్చి చేసిన పనికి అంతా నోరెళ్లబెట్టేశారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాట్లం గ్రామంలో 30 ఏళ్ల వివాహిత భర్త, అత్తామామలతో కలిసి నివసిస్తోంది. అయితే ఈమె మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపి అతనితో వెళ్లిపోగా, మహిళ కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా తిరిగి రాలేదు.
ప్రియుడితోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది. ఈ పరిణామంతో పరువు పోయిందని, ఊర్లో తలెత్తుకుని బతకలేమని భావించిన ఆమె భర్త, అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఊరు విడిచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న మహిళ ప్రియుడితో కలిసి మాజీ భర్త ఇంటికి వచ్చి అందులోనే కాపురం పెట్టింది. ఇరుగుపొరుగు వారి వల్ల ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త, అత్తామామలు తీవ్ర ఆగ్రహానికి లోనై మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో దాడి చేసి చితకబాదారు. విడిచిపెట్టమని కన్నీరు పెట్టినా వదలకుండా కోపాన్నంతా చూపించడంతో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడింది. గాయాలతో ఉన్న మహిళను ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా, కొట్టిన భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.