A Japanese company that brought flying bikes to the American market
mictv telugu

వీడియో : గాల్లో ఎగిరే బైకులు.. వచ్చే ఏడాది మార్కెట్లోకి

September 16, 2022

బైకులంటే సాధారణంగా రోడ్లపై ప్రయాణించేవే అనుకుంటాం. కానీ, దీనికి భిన్నంగా ఆలోచించిన ఓ జపాన్ స్టార్టప్ కంపెనీ గాల్లో ఎగిరే బైకుని రూపొందించింది. ఈ బైకు జపాన్ మార్కెట్లో ఇప్పటికే ప్రవేశ పెట్టగా అమెరికా మార్కెట్లో మాత్రం వచ్చే ఏడాది లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. డ్రోన్ మాదిరి గాల్లో దూసుకెళ్ళే ఈ బైకు 40 నిమిషాల పాటు గాల్లో ఎగరగలదు. ఆ సమయంలో సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దీనితో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లిపోవచ్చని వివరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్ అయిన దీని పేరు క్స్‌టీయూఆర్ఐఎస్‌ఎమ్ఓ. దీనిని ఇటీవల అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఒకరు మాత్రమే కూర్చునే వెసులుబాటు ఉన్న ఈ బైకు ధర మాత్రం భారీగానే ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ. 6 కోట్లకు పైగా ఉంది. అయితే 2025 వరకు ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని కంపెనీ చెప్తోంది. అమెరికా ఈ బైకుని నాన్ ఎయిర్ క్రాఫ్ట్ వెహికిల్‌గా భావిస్తుందని కంపెనీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ బైకులను సాధారణ ప్రయాణాలతో పాటు అత్యవసర సేవలకు వినియోగించే అవకాశముందని కంపెనీ వెల్లడిస్తోంది.